Saturday, September 10, 2011

ఆమె కథ


                         సుమారు 50 సం||లు ఉంటాయి ఆమెకి.వృద్ధాప్యపు ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.అలాగని ఆమెది కృతిమ సౌందర్యం కాదు.చక్కటి మేని ఛాయ ఏ దేవతో తన అందాన్ని ఈమెకి ధారాదత్తం చేసిందా అన్నట్టుగా ఉంది ఆమె అందం.ఈ అందానికి తోడు ఆమెలోని మంచితనం, సహృదయం వంటి సుగుణాలు ఆమెకు వన్నె తెచ్చాయి.వయస్సు మీద పడినా చాదస్తపు ఛాయలు కనబడుటలేదు.కానీ ఆమె మనస్సు ఏ మాత్రం ఆనందంగా ఉంది అనేది ఎవరికీ తెలియని విషయం.

                        ఆమె అందరికీ కావాలి, కానీ ఎవరికీ ఆమె అక్కరలేదు. ఇదేంటీ చిత్రంగా ఉందే అనుకుంటున్నారా! అదే మరి అర్ధం కావల్సిన విషయం.ఆమె అందరికీ కావాలి అంటే ప్రొద్దున లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరికీ ఆమె అవసరం ఖచ్చితంగా ఉంటుంది.ఎవరికీ ఆమె అక్కర్లేదు అంటే ఆమె ఆనందంగా ఉందా, ఏమైనా తింటున్నదా లెదా? అనే విషయాలు ఎవరికీ పట్టవు.మనవలు మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడపాల్సిన వయస్సు.కానీ ఎవరికీ కాకుండా ఒంటరిగా ఎక్కడో మారుమూల పల్లెలో ఇలా గడపాల్సి వస్తుంది జీవితం.ఆమె ఏనాడు అనుకొని ఉండదు ఈ రోజున ఇలాంటి జీవితం గడపాల్సి వస్తుందని.

                   ఏంటీ! ఎంతసేపటికీ ఆమె,ఆమె జీవితం,ఆమె బాధ అంటూ సాగదీస్తావు ఇంతకీ ఏమిటి "ఆమె కథ" అంటారా వినండి చెప్తా.

                 ఆమె పేరు "భువన".ఆమె పుట్టిన 6సం||లుకే తండ్రి చనిపోయాడు.అక్కచెల్లెలు అన్నదమ్ములు ఎందరు ఉన్నా ఆమె ఎవరికీ ఏమి కానిది ఎందుకంటే ఆమె పుట్టిన తరువాతే వారింట దరిద్రలక్ష్మి తాండవిస్తుందని వారి భావన.వీరికి తినడానికి తిండి,కట్టుకొవతానికి బట్టా, విలాసాలకు రొక్కము మొ|| వాటికి ఏ మాత్రం కొదువ లేకపొయినా, ఆమె పుట్టిన దగ్గరినుండి తండ్రి వారిని సరిగా దగ్గరకు రానివ్వకపోవటం,ముద్దులాడకపోవటం, చేతిఖర్చులకు సొమ్ములివ్వకపొవటం వారికి నచ్చేది కాదు.అందుకే ఆమె అంటే వారికి ఇష్టం ఉండెడిది కాదు.  
                  తండ్రి చనిపోయిన దగ్గరనుంచి మొదలయినవి ఆమె కష్టాలు.ఎవరూ ఆమెతో మాట్లాడెడి వారు కాదు,ఆటలాడేవారు కాదు.కనీసం దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.చెల్లి,తమ్ముడు ఉన్నను ఆమెను అంతగా పట్టించుకునేవారు కాదు.ఇక తల్లి సంగతి సరేసరి."నువ్వు పుట్టినప్పటి నుంచే కదే మాకు ఈ కష్టాలు" అంటూ రోజుకు ఒకసారన్నా తిట్టేది.ఇదిలా ఉంటుండగా కాలచక్రం ఆమె కోసం ఆగకుండా పరుగులెడుతూ,నీకంటే నేనే ముందంటూ 20సం||లు వద్ద ఒక్కసారి ఆగింది.ఇప్పుడామెకు 26సం||లు అంటే యుక్తవయస్కురాలు అన్నమాట.ఏదో విధంగా ఆమెకు వదిలించుకోదలచి తల్లి ఆమె అన్నలతో చేరి అతి తక్కువ కట్నం తీసుకునేవాడికిచ్చి కట్టబెట్టింది.

                    హమ్మయ్య పోనీలే ఇకనైనా సుఖపడుతుంది అనుకుంటున్నారేమో కాస్త అక్కడ ఆగి ఇది చదవండి అతడు చక్కనివాడే కానీ చిక్కనివాడు ,చిక్కులు కొనితెచ్చువాడున్ను.అంటే రోజుకో రకంగా ఇంటికి వచ్చువాడు.ఒకరోజు త్రాగి వస్తే,మరొక రోజు అప్పులవారిని వెంట తెచ్చువాడు.ఒకరోజు పేకాటరాయుళ్ళతో వస్తే మరియొక రోజు పడతితో వచ్చేడి వాడు. విధి ఆడిన వింత నాటకానికి తను బలిపశువు అయిందా అన్నట్లు ఆమెకు 32ఏళ్ళు రాగానే ఇద్దరు పిల్లలు చదువుకు వచ్చారు. పెద్దవాడికి 1వ తరగతి పుస్తకాలు కొనాలి. చిన్నదాన్ని బడిలో వెయ్యాలి కానీ ఇవేమీ పట్టవు ఆ జల్సారాయుడికి. అలాంటి వాడికి పిల్లలెందుకు అంటారా! అన్ని రోజులూ వాడి దగ్గర డబ్బు ఉండదు కదా, డబ్బులేనినాడు పడతులు వచ్చేవారు కాదు, వాడి సుఖం కోసం ఆమెనే పడతిగా తలచెడివాడు. ఆ గుర్తులే ఈ పిల్లలు.

                        ఎలాగో కష్టాలుపడి అతడిని మచ్చిక చేసుకుంటూ తను కష్టపడుతూ పిల్లలనైతే చదివించగలిగింది. అమ్మాయి యుక్త వయస్సుకి రానే వచ్చింది. కొడుకు చేతికందితే కష్టాలు తీరుతాయి కదా అనుకున్న ఆమె ఆశ నిరాశే అయింది. కొడుక్కి అవేమి పట్టవు. ఎంతసేపటికి నేను, నాది నా డబ్బు, నా సుఖం , ఇన్ని రోజులూ మీ దగ్గర నేనేమి సుఖపడ్డాను అంటాడే తప్ప ఇంకేమి పట్టించుకోడు. ఒకనాడు ఆమె కొడుకుని దగ్గరకు పిలిచి "చెల్లెలికి పెళ్ళి చెయ్యాలిరా! ఆ బాధ్యత నీదే, నాకా వయసు మీద పడుతుంది, మీ నాన్న చూడబోతే రోగంతో మంచం పట్టాడు ఈ ఒక్క సహాయం చేయరా" అని అర్ద్రమైన గొంతుతో వేడుకుంది. మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానిండి "నేను పెళ్ళి చేసుకొని ఆ వచ్చిన కట్నం డబ్బులతో చెల్లి పెళ్ళి చేస్తానులే" అన్నడు. ఘనుడు. కనీసం దానికైనా ఒప్పుకున్నాడులే అని సమాధానపడి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఎలాగైతేనేం అతడు పెళ్ళి చేసుకొని, చెల్లెలి పెళ్ళి చేసి అత్తగారింటికి సాగనంపాడు.
                          సంవత్సరాదిన అతడి పెళ్ళి, మధ్యమాన చెల్లెలి పెళ్ళి, బాధ్యతలు తీరినవిలే అనుకుంది ఆమె. ఇంకా ఎక్కడ "కర్మానుబంధం మనుష్యరూపే" అన్నట్లుగా ఇంకెన్ని కర్మలు(పనులు) చేయాల్సినవి ఉన్నాయో ఆమెకు తెలియదు కదా! కొడుక్కి పెళ్ళి అయి సంవత్సరం దాటిందో లేదో భర్త చావు, మనవడి పుట్టుక. "ఆహా యమా! సమం చేసితివా!" పిల్లలిద్దరి సహాయంతో ఆ కర్మలేవో కానిచ్చింది. కూతురు కర్మలవగానే తన అత్తగారింటికి అదేనండీ మన పట్నానికి వెళ్ళిపోయింది. కొడుకు ఎలాగో ఇంట్లో ఉండేవాడే, కానీ కొత్తరకం చిక్కు, అతడి బావమరిది కూడా ఇక్కడే ఉంటాడట భార్యగారి ఆజ్ఞాపన, భర్తగారి సమ్మతి తోడై , ఆమె పని మరింత పెంచాయి. అర్ధం కాలేదుటండీ కొడుకు కుటుంబం, కోడలి తమ్ముడిగారి కుటుంబం, మనవడి బాధ్యత ఇవన్నీ ఆమే కదా చూసుకోవాల్సింది.
                         సరేలే ఏమైతేనేమి మనకంటూ మిగిలింది ఏమీ లేదు కదా! వీరినైనా సంతోషంగా చూసుకుందాం అనుకుని వారికి సేవలు చేయసాగింది. కోడి కూయక ముందే లేవాలి, లేస్తుంది ఇళ్ళంతా ఊడ్చి, వాకిలి చల్లి, ముగ్గు పెట్టి, కాఫీ పెట్టి మొదట కోడలుగారికే ఇవ్వాలి. అది ఆమెగారి ఆజ్ఞ. భర్త ముందు తనే కష్టపడుతున్నట్టు ఉండాలి కదా , అదెలాగంటారా ముందు ఆమెకే ఇవ్వాలి అంటే ఆమెనే లేపాలి కదా... చూడని వారికి ఈ పనులన్నీ ఎవరు చేసారో తెలియదు కదా... కోడలుగారి మాట దురుసుతనం ముందు ఏది ఆగుతుంది చెప్పండి..... కోడలు కాఫీ తాగిన తర్వాత ఆ రోజు చేయాల్సిన టిఫినేంటో, వంటలేంటో చెప్తారన్నమాట. ఆ ఏర్పాట్లు చేస్తూ గుక్కెడు కాఫీ అయినా నొట్లో పోసుకోవడం మర్చిపోతుంది అప్పుడప్పుడు. 9 కొట్టేసరికి బాక్సులు కట్టి టిఫిన్లు పెట్టేస్తుంది. ఎవరి దారిన వారు పోయాక అంట్లన్నీ తోమి బట్టలుతికేసరికి సూర్యుడు నడినెత్తి దాటేసుంటాడు. ఏవో రెండు ముద్దలు తిందాంలే అనుకుంటుండగా మనవడి ఏడుపు. కోడలు లేదా అని చూస్తే ఉంటుంది కానీ టి.వి . చూస్తూనో, పక్కింటామెతో తను కొన్న కొత్త చీర గురించి చెప్తూనో... పైగా "అత్తయ్యా! ఏమి వెలగబెడుతున్నారక్కడ కాస్త ఇటు వచ్చి కొంచెం బాబు చూడొచ్చు కదా! అబ్బబ్బ ఈ ముసలావిడతో ఛస్తున్నాం" అని కూడా అంటుంది. "ఇదేమి చోద్యం!" అనుకుంటున్నరా ' అదే విధి ' . మనవడిని ఎత్తుకొని పాలు పట్టించి, నిద్రపుచ్చి తను తినేసరికి పక్షులు ఒకటీ, రెండుగా అప్పుడప్పుడే ఇళ్ళకు వస్తుంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా ఇల్లు చేరుకుంటారు.

                     వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వేడి వేడి కాఫీ అందివ్వాలి. ఎవరూ సహాయం కూడా చేయరు. తనే అన్నీ చెసుకోవాలి.అదంతే. కాస్తో కూస్తో ఆ బావమరిదిగారి భార్య మంచిదనే చెప్పవచ్చు ఆమెను ఏమీ అనదు కాబట్టి. ఇలా ఆమె దినచర్య రాత్రి భోజనాలు, మంచాలు పరిచి పక్కబట్టలు వేయటం దాకా కొనసాగుతుంది. ఇలా, అలా, ఎలాగైతేనేమి ఆమె జీవితం సాగుతుంది. కాలం గడుస్తూ ఉంటే మనవడు, మనవరాలుతో పాటు కూతురికి ఒక కొడుకు పుట్టాడు. వారిలో తన బాల్యాన్ని చూసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది.

                      ఇంతలో ఒకరోజు కొడుకు బావమరిదిగారు వచ్చి "బావా! నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. నేనూ, నా కుటుంబంతో సహా వెళ్ళదలిచాను" అన్నాడు. "హమ్మయ్యా! ఒక బాధ్యత తప్పిందిలే ఆమెకు" అనుకుంటున్నారా.... ఇంకా చదవండి "నాకు ఉద్యోగం వచ్చిన ఫ్యాక్టరీలోనే నీకు కూడా ఒక చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తాను, కాకపోతే ఒక 2లక్షలు ఖర్చు అవుతుంది. నీ ఉద్యోగం వచ్చేవరకు నువ్వు నా దగ్గరే ఉండవచ్చు. ఇన్ని రోజులూ నువ్వు నన్ను చూసుకోలేదా ఏమి?" అని ఇంకా అతను సమాధానం చెప్పకముందే "ఏమంటావే అక్కా! నువ్వైనా చెప్పు బావకి" అని సైగ చేసాడు. ఇదే అదనుగా "అవునండీ పిల్లలకు మంచి చదువులు కావాలన్నా, మన కష్టాలు తీరిపోవాలన్నా ఇదే మంచి అవకాశం. మీరు కాదనకూడదు .... లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంతే" అంది.

                      దానికతడు కాసేపు ఆలొచించి ..... "అది కాదే 2లక్షలంటే మాటలా ఇప్పటికిప్పుడు ఎక్కడనుంచి వస్తాయే " అన్నాడు. దానికామె "ఓస్! అదా మీ దిగులు. లంకంత కొంప మనమెవరూ లేకపోతే ఏం చేసుకోవడానికి...? దీనిని అమ్మితే పోలా!" అంది. అందుకతడు "ఆ! ఇంటిని అమ్మెయ్యాలా....? మరి అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆమెను చూసేవారు ఎవరు?" అని అడిగాడు. దానికి బావమరిదిగారి భార్య "అన్నయ్యగారూ! మీరు మరీ అంత బాధపడాలా మా పుట్టింటికి దగ్గరలో ఒక చిన్న గది ఉంది. ఇరవై వేలంట, అమ్ముతున్నారని మొన్న మా అమ్మ వచ్చినప్పుడు చెప్పింది. ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులో అది ఎంతో కాదు కదా! మనకని చెప్తే కొంత తగ్గిస్తారు కూడా... అంతేనా.. ఏమంటావ్ వదినా" అంది.

                ఇదీ ఆమెగారి మంచితనం.

                  "ఇంకేంటండీ ఆలోచిస్తున్నారు. త్వరగా ఇల్లు అమ్మకం పెట్టంది లేకపోతే నేను మా...."
                   "సరె సర్లేవే అలాగే కానిద్దాం"

                    ఆమె గుండె ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఇంత జరిగాక కూడా ఇంకా ఎందుకురా దేవుడా నన్ను తీసుకెళ్ళలేదు అని గట్టిగా అరవాలనుంది. కానీ, ఏనాడు నోరెత్తి గట్టిగా మాట్లాడనైనా లేదామె. ఇంక ఏమనగలుగుతుంది. చూసారా కాలం ఎంత బలీయమైనదో, విధి ఆడిన వింత నాటకానికి ఆమె మరొకసారి బలయ్యింది. "ఏమిటో కదా ఈ లోకం...."

                     ఆ విధంగా ఆమె ఆ మారుమూల పల్లెలోని ఒక చిన్న గదికి చేరింది. ఇప్పుడు ఆమెకు 50సం||లు.
                      

                          కొడుకు పట్నం వెళ్ళిపోయాక కనీసం క్షేమంగా చేరానన్న వార్త కూడా చెవిన పడలేదు. ఒక్క ఉత్తరం ముక్కైనా అందలేదు. ఇంక ఆమె తిండీ తిప్పల గురించి కష్టపడవలసిన రోజులు మళ్ళీ వచ్చాయి. "ఈ జీవుడు ఉన్నంత కాలం మనం దేవుడిని నమ్ముకుని ఏదో ఒక కష్టం చేసుకొవలసిందే కదా !" అనుకుని ఆ ఇంటా ఈ ఇంటా పనులు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది. ఒంట్లో బాగున్నా లేకపోయినా ఒక్క రోజు కూడా మానెయ్యకూడదు కదా పనిమనిషి, ఒకవేళ మనేసినా జీతంలో కోత. ఇలా ఏదోవిధంగా నాలుగు గింజలు నొట్లో పడేంత సంపాదించుకోగలుగుతుంది.

                     ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె పని చేయాల్సిన ఇంటికి వెళ్తుండగా దారిలో ఇంటామె కనబడి "నీ కొసమే వస్తున్నా ఇక్కడికి దగ్గర్లో మా పిన్నిగారిల్లు  ఉంది. వారికి పనిమనిషి కావాలట, నువ్వు ఉన్నవు అని చెప్పా తీసుకుని రమ్మన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం పదా !" అని అంది. ఆమెకు ఇష్టమా లేదా అనేది ఇంటామెకు అనవసరం కదా!      

                      ఆమెతో వెళ్తుంది భువనమ్మ. అది వేరే వీధి. "మళ్ళీ రోజు 2 వీధులు దాటుకొని ఇక్కడ దాకా రావాలా" అనుకుంది. ఈ వీధిలోని వారు కాస్త మంచివారుగా తోస్తున్నారు ఆమెకి. అన్నీ పరికించుకుంటూ ఆ ఇంటిలోకి వెళ్ళింది. అక్కడికంటే కాస్త తక్కువ జీతమే అయినా ఎందుకో పని చెయ్యాలనిపించింది ఆమెకు. పని ఒప్పుకుని మరుసటి రోజు నుంచి వస్తానని చెప్పి వెనక్కి వచ్చేసింది.

                   కొత్త ఇంట్లో పనికి రెండు రోజులు ఇబ్బంది పడ్డా మెల్లగా సర్దుకుంది. అలవాటయిన పనే కాబట్టి పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. అలా రోజూ మొదట ఆ వీధిలో పని చెయ్యటం తిరిగి ఈ వీధికి వచ్చి పని చెయ్యటం, అలా కొనసాగుతుండగా ఒకరోజు ఈ వీధిలో ఇంటివారు ఊరు వెళ్తున్నామనీ మరల రేపు పనికి రమ్మనీ చెప్పారు. సరేలే అనుకుని నడుస్తూ వస్తుండగా  ఒకరింట ఒక తాత కట్టెలు కొడుతూ కనిపించాడు. అందులో ఆశ్చర్యమేమున్నదీ అంటారా! ఆ తాత పక్క వీధిలో పండ్లు అమ్మే తాత. తాతకు 90సం||లు ఉంటాయి. రోజూ గడప నిండా పండ్లు తెచ్చి వీధులన్నీ తిరిగి అమ్మేవాడు. మరి ఆయన కట్టెలు కొట్టడం ఏంటా అనుకుంది. "అయినా నా పిచ్చి కాకపొతే పండ్లు అమ్మడానికి వస్తే కట్టెలు కొట్టమన్నారేమో  నాలుగు డబ్బులు వస్తాయి కదా అని కట్టెలు కొడుతున్నాడేమో" అని అనుకుంది.

                        ఇలా కొనసాగుతుండగా రోజూవారి దినచర్యలో ఎక్కడో ఒకచోట తాత తారసపడేవాడు. కానీ వేరువేరు పనులు చేస్తూ "ఏమోలే ఈ తాతకి ఆశ ఎక్కువ ఉన్నట్లుంది" అని నవ్వుకుంది.

                     కాలం గడుస్తుంది. ఆ రోజు "కార్తీక పౌర్ణమి" పెందలాడే ఇళ్ళకెళ్ళి పనులు ముగించుకొని, గుడికెళ్ళింది. అప్పటికే పది గంటలయింది. హడావిడిగా గుళ్ళోకి వెళ్ళి 365 వత్తులు వెలిగించి, తీర్థ ప్రసాదాలు తీసుకుని, కాసేపు కూర్చుని, మెల్లగా ఇంటికి వెళ్దామని బయటకు వచ్చింది. తీరా తను చెప్పులు పెట్టే దగ్గర చూస్తే "తాత". ఇందాక హడావిడిలో గమనించలేదు. ఎందుకో తాత గురించి తెలుసుకోవాలనిపించింది ఆమెకు. తాత పక్కనే కూర్చుని "నాన్నా! నువ్వు ఎందుకు ఈ వయస్సులో ఇంత కష్టపడుతున్నావు. అంత డబ్బు ఏమి చేసుకుంటావు. తిండి మందం సంపాదించుకోరాదా?  " అని అడిగింది. అందుకు తాత నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆమె పట్టుబట్టి తాతను పదే పదే అడగడంతో తాత నోరు విప్పాడు.


             "నేను సంపాదించేది నా కోసం కాదమ్మా!"
           ఒహో ఇతనిది కూడా నా లాంటి బతుకే కాకపోతే కొడుకేమైనా డబ్బుకి వేధిస్తాడేమో అనుకుంది.
         "నీ కొడుకుల కోసమా నాన్నా ఈ కష్టం?" అని అడిగింది.
         "కాదమ్మా అదో పెద్ద కథ. అయినా అదంతా నీకెందుకులే"  అన్నాడు తాత.
         "అదేంటి నాన్న అలా అంటావ్ నేను నీ కష్టం తీర్చగలనో లేదో కాని చెప్తే వింటాను కదా, నీ గుండె బరువైనా తగ్గుతుంది" అని అర్ధించింది.
                                             

              "సరేలే విను. నేను మొదట పండ్లు మాత్రమే అమ్మేవాడిని. రోజంతా అమ్మగా వచ్చిన డబ్బు వీధి చివరన కూర్చుని లెక్కపెట్టుకునే వాడిని. ఇదిలా ఉండగా ఒక రోజు వీధి చివరికి వచ్చేసరికి ఒక పసికందు ఏడుస్తూ కనబడ్డాడు.. దగ్గర్లో ఎవ్వరూ లేరు. ఒక గంట అక్కడే వేచి వున్నా, ఎవరైనా వస్తారేమో అని. కానీ ఎవరూ రాలేదు. చూస్తూ చూస్తూ పసికందును వదలబుద్ది కాలేదు. ఇంటికి తీసుకెళ్దామా అంటే ముసల్ది ఏమంటుందో అని భయం. ఎలాగైతేనేమి ఇంటికి తీసుకెళ్ళాను. ఏమనుకుందో ఏమో ముసల్ది "కన్నబిడ్డలు కాదన్నారు, వీడినైనా మన బిడ్డలా చూసుకుందామయ్యా" అంది. హమ్మయ్యా అనుకొని సంతోషించాను.
       
                     కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వీడంటే నాకు దొరికాడు కాబట్టి పెంచుతాను, ఎందరో పిల్లలు రోడ్డు మీదనే బతికేస్తున్నారు , వాళ్ళందరి సంగతేంటి? వళ్ళ కోసం నా వంతు సహాయంగా నేను ఏమైనా చెయ్యాలి అనుకున్నను. వెంటనే ఈ విషయం పిల్లాడిని పడుకోబెడుతున్న ముసల్దానికి చెప్పాను, అది కూడా సరేనంది. పొద్దున్నే లేచి నా బాల్య స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. ఇద్దరు మాత్రం నాతో ఏకీభవించారు. మేము నలుగురం కలిసి మా ఇంటి వెనక ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి తాటాకులతో ఒక పెద్ద గది కట్టాం. నేను, నా స్నేహితులు వీధులన్నీ వెథికి అనాధ బాలలను తీసుకువచ్చాం. మొత్తం 10 మంది అయ్యారు. ఆ రోజు నుంచి నేను మధ్యాహ్నం కల్లా పండ్లన్నీ అమ్మి, మధ్యాహ్నం నుంచి ఒక వ్యాపారి వద్ద కట్టెల పని చేస్తాను. సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు ఆడుకొని అన్నం తిని పడుకుంటాను. రాత్రి పదింటికి లేచి ఫ్యాక్టరీ లో వాచ్ మెన్ గా పని చేస్తుంటాను. ఇలా ఆదివారాలు, పండగ రోజుల్లో గుడి దగ్గర ఉంటాను. మా ముసల్ది పొద్దుట్నించి సాయంత్రం దాకా దగ్గర్లోని బడిలో ఆయాగా పని చేస్తుంది, పిల్లలకి భోజనం వండి పెడుతుంది.

                       నా స్నేహితులలో ఒకడు పిల్లలకు పాఠాలు చెప్తాడు, మరొకడు వారి కోసం అన్ని చోట్లా తిరిగి పుస్తకాలు, బట్టలు సేకరించి తెస్తాడు." అని తన కథంతా చెప్పాడు తాత.

                     ఇదంతా విన్న ఆమెకు గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోనారంభించిది. కన్నీళ్ళు తుడుచుకోవడం కూడా మరిచి తాతను అలాగే తదేకంగా చూడసాగింది. "ఏంటమ్మా ! అలా చూస్తున్నావు" అన్న తాత మాటలతో ఈ లోకం లోకి వచ్చింది.
                                 

                         ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది "ఏమీ లేదు నాన్నా, ఇన్ని రోజులూ నేనూ, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భర్త, కొడుకు, కూతురు ఏ ఒక్కరూ నన్ను చూడలేదని ఎంతో బాధపడేదాన్ని. ఒకరు నన్ను చూసేదేంటి? నన్ను నేనే చూసుకుంటాను అనుకొని పనులు చేసుకున్నాను. కానీ "నా కోసం నేను బ్రతికితే అది స్వార్ధం అవుతుంది, పరుల కోసం నేను బ్రతికితే అది పరమార్ధం అవుతుంది" అని గ్రహించలేకపోయాను". అని తన కథంతా తాతకు చెప్పి ఇలా అడిగింది.

                 "ఇప్పుడు చెప్పు నాన్నా! నేను మీకు ఎలా సహాయపడగలను. నన్నూ మీలో చేర్చుకుంటారు కదా?"

                  "తప్పకుండా తల్లీ! నీ వంతు సహాయం నువ్వు కూడా చెయ్యి, ఎవరి పుణ్యం వారిది, నాతోరా మా ఇల్లు చూపిస్తా" అంటూ ఆమెను తనతో తీసుకెళ్ళాడు.

                     తాతది పూరి గుడిసె అందులో ఒక పక్క పొయ్యి మరో పక్క నులక మంచం ఉన్నాయి. ఇంటి వెనక భాగాన ఉంది ఆ పిల్లల గది. పిల్లలు పండగ రోజు కదా ఆడుకుంటున్నారు. ఆ ఇల్లు, ఆ సందడీ చూసి ఆమె ఎంతో ఆనందించింది. తను కూడా ఎలాగైనా వీరికి సహాయపడాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి మెల్లగా ఇంటిదారి పట్టింది.

                     ఆ రాత్రంతా బాగా ఆలోచించి తను ఉంటున్న గది అమ్మేసి ఆ పిల్లలతో పాటే ఉందామని నిశ్చయించుకుని నిశ్చింతగా నిద్రపోయింది. ప్రొద్దున్నే లేచి గబగబా పనులు చేసుకుని ఇంటామెతో "అమ్మా! ఇంకా ఏమైనా ఇళ్ళుంటే చెప్పమ్మా చేస్తాను" అని వెళ్ళిపోయింది.

                     గుడిసె వద్దకు వచ్చిన ఆమెను వారందరికీ పరిచయం చేసాడు. ఆమె తీసుకున్న నిర్ణయం వారందరికీ నచ్చింది. ఆమెను కూడా వారిలో ఒకరిగా స్వీకరించారు. ఆమె కుడా ఎక్కువ గంటలు పనిచేయనారంభించింది. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు పోస్టాఫీసు లో వేసింది, పిల్లల కోసమై.

                   కాలం గడుస్తున్నా కొద్దీ పిల్లలు పెద్ద వారు కాసాగారు. వారో వీరో సహాయాలు కూడా చేస్తున్నారు. ఆ పిల్లల్లో పెద్దవాడు బాగా చదివి వాళ్ళ ఊళ్ళోని బడిలో ఫస్టు వచ్చాడు.

            అబ్బా! అనుకోకండీ లక్ష్మి లేనిచోట సరస్వతి తప్పకుండా ఉంటుంది.

                    వాడిని అదే ఊరిలోని కళాశాల వారు ఉచితంగా చేర్చుకున్నారు. పుస్తకాలు కూడా వారే ఇచ్చారు. మొత్తానికి పెద్దవాడి చదువు గాడిలో పడింది. ఇక దిగులేముంది అనుకుంటూ వారు అలా 2సం||లు గడిపారు. వాడు పై చదువుకు వచ్చాడు. మంచి ర్యాంక్ వచ్చినా 30,000 లేనిదే కాలేజీలో చేర్చుకోమన్నారు మేనేజ్జ్మెంట్ వారు. ఎంత వెతికినా అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలో అర్ధం కాలేదు వారికి.          

                    ఎవరైనా 100, 200 అంటే సహాయం చేస్తారు వేలకు వేలు చెయ్యరు కదా! ఇంతలో ఆమెకో ఆలోచన వచ్చింది. తను పోస్టాఫీసులో వేసిన డబ్బు ఇప్పటికి 40,000 అయింది కదా అవి తీద్దాం అంది. అవి తీస్తే మిగితా పిల్లల గతేం కానూ అన్నారు మిగితావారు. ఏదైతే అదవుతుంది లెమ్మని 30,000 ఫీజు కట్టి . 5,000 హాస్టల్ కి కట్టి ఆ సంవత్సరం చదువు వెళ్ళదీసారు.

                         ఎప్పటిలాగే మనవాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగి రెండో సంవత్సరం రానే వచ్చింది. మళ్ళీ 30,000 ఎలాగా అని ఆలోచిస్తుంటే దేవుడు వరమిచ్చినట్లు ప్రభుత్వం వారు స్కాలర్ షిప్ ప్రకటించటం , కాలేజ్ వారు ప్రథమ, ద్వీతీయ ర్యాంకులు  వచ్చిన వారికి నగదు బహుమతులు ఇవ్వడంతో కష్టాలు తీరినాయి. ఎలాగైతేనేమి ఆ పిల్లాడు కష్టపడి 4సం||లు చదివి ఇంజనీర్ అయ్యాడు. అతడి ప్రతిభను గమనించిన ఒక బహుళ సంస్థల కంపెనీ అతనికి నెలకు 30,000 ఆదాయం వచ్చే ఉద్యోగం ఇచ్చింది. ఇక వారి ఆనందానికి అవధి లేదు. అతడు కూడా వారి సహాయాలను విస్మరించక అతడి ఖర్చుల నిమిత్తం ఉంచుకుని మిగితా జీతం వీరికే పంపసాగాడు.

                        ఇతడి ప్రతిభాపాటవాలు, కష్టించి పని చేసే తత్వం గమనించిన కంపెనీవారు ఇతనిని విదేశానికి కూడా పంపారు. అతడు అక్కడ పని చేస్తూనే ఈ పల్లెలో వీరి కోసం పెద్ద స్థలం కొని ఆ పిల్లలందరి బాధ్యత తనే తీసుకున్నాడు.

                       ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడామెకు 80సం||లు. కొంతకాలం క్రితమే తాత కన్నుమూసాడు, తాత పోయిన మూణ్ణెళ్ళకే  ముసలామె కూడా చనిపోయింది. వారిద్దరూ పోతూ పోతూ పిల్లలను ఆమె చేతిలో పెట్టి పోయారు.
                     క్రమేణా పిల్లలందరూ బాగా ఎదిగి ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన పెద్దవాడు ఆ పిల్లలందరితో కలిసి "XXX అనాథ శరణాలయం" మరియు "XXX వృద్ధాశ్రమం" కట్టించాడు.

                     ఇప్పుడామె పనులన్నీ మానేసింది. అన్నిటినీ చూసుకోవడానికి మనుషులున్నారు. ఆమె పని పర్యవేక్షించడం మాత్రమే. పిల్లలందరూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఒక వారం వుండి వెళతారు. ఆమె వారి కోసం ఎన్నో పిండి వంటలు చేయించి వారు వచ్చినప్పుడు స్వయంగా తానే వడ్డించేది. వారు ఒకరొకరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.

జీవితానికి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి. బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏమంటారు? 

                     ఈ సంస్థలకు ప్రభుత్వం నుండి కూడా కొంత ధనం లభించసాగింది. ఆ 10 మంది పిల్లల దయ వల్ల ఇప్పుడు అది ఎన్నో శాఖలుగా విస్తరిస్తుంది. ఏ  శాఖలోలైనా శరణాలయం, ఆశ్రమం పక్క పక్కనే ఉండటంతో పిల్లలు తాతయ్య, అమ్మమ్మలతో... పెద్దలేమో పిల్లలతో ఆనందంగా గడపసాగారు.

                  వీరి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ సంస్థ స్థాపకులను అభినందిస్తూ  "XXXX" అవార్డుతో సత్కరించింది. పెద్దవాడు ఆమెను వెంట తీసుకెళ్ళి ఆ అవార్డు గవర్నరుగారి చేతుల మీదుగా ఆమెకు ఇప్పించాడు. ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి "ఈ అవార్డుకు అసలు హక్కుదారు నేను కాదు, ఒక 10మంది పిల్లలను చేరదీసిన అమ్మానాన్నలది" అంటూ తాత కథ వివరించింది.

                        ఇదంతా వింటున్నవారందరి కళ్ళు చెమర్చాయి. కొందరి కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి. కానీ, ఇద్దరి భ్రుకుటులు మాత్రం ముడిపడ్డాయి. వారే కొడుకు, కోడలు. వెంటనే ఆ పల్లెకు వచ్చారు. ఆమె ఉన్నతిని చూస్తూ ఏమనుకున్నారో ఏమో తెలీదండీ "మాతో రా అమ్మా!" అంటే "మాతో రండి అత్తయ్యా!" అని ఒకటే గొడవ. మనవడికి కొడుకు పుట్టాడట. విని సంతోషించింది.

                       "మీరు ఇచ్చిన గది చాలు బాబూ నాకు. ఆ సొమ్ము కూడా నాకు అక్కర్లేదు" అంటూ 20,000 తీసి వారి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఇదంతా తెలుసుకున్న మనవడు ఆమె వద్దకు వచ్చి "అమ్మమ్మా! నా తండ్రి చేసిన తప్పుకు నేను క్షమాపణలు చెప్పుకుంటాను. నా భాద్యతగా మా ఊరిలోని మీ సంస్థయొక్క బాగోగులు నేను చూసుకుంటాను" అని అన్నాడు.

                      పోనిలే మనవడైనా మంచివాడిగా మిగిలాడు అని సంతోషించి అలాగే కానిమ్మంది.

                      ఇదంతా గమనించిన ఆమె కొడుకూ, కోడలు "మమ్మల్ని క్షమించండీ" అంటూ పాదాలు పట్టుకున్నారు.

                      పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా, అందులోనూ అమ్మ మనసు, వారిని క్షమించింది. ఆ రోజు నుంచి వారు కూడా అక్కడే ఆశ్రమంలో ఉంటూ అక్కడి పనులు చూసుకుంటున్నారు.

                        కాలం మనెవ్వరి నేస్తం కాదు కదండీ మన కోసం ఆగకుండానే పరిగెత్తుతూ, నీకంటే నే ముందంటూ తనతో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళింది.

                        "ఆమె" ఇప్పుడు లేదు, కానీ ఆమె ఆశలు, ఆశయాలు అన్నీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాయి.

                           మరి మనం ఏ మాత్రం పక్కవారికి సహాయం చేస్తున్నాం. ఒక్కసారి పరీక్షగా చూడండి ఎందరో మన సహాయం కోసం వేచియున్నారు.
               కదలండి.... కాపాడండి.... "మనుషులం" అని చాటి చెప్పండి.